Monday, May 21, 2018

ఎంత పరమ బంధుడవో!


Audio link by Sri Sattiraju Venumadhav garu: https://archive.org/details/EntaParamaBandhudavoSriSattirajuVenuMadhavSriVinnakotaMuraliKrishna1


మనము ఒక్క పూట ఆఫీసు పని సరిగా చెయ్యకపోతే మన పై అధికారులు మనని సంజాయిషీ అడుగుతారు. ఇంటిలో ఒక్క రోజు పనులు చెయ్యకపోతే, లేదా వారితో సమయం గడపకపోతే ఇంట్లోనివారు అలుగుతారు. మన ఇంటికి వఛ్చిన బంధువులతో మనం సమయం గడపకపోతే వారు చిన్నబుచ్చుకుంటారు. మనమే ఒక వేళ మరొకరి ఇంటిలో ఉంటూ ఆ ఇంటి వారితో సరిగా మాట్లాడకుండా ఉంటే అప్పుడు మన యెడల వారి ప్రవర్తన/భావన ఎలా ఉంటాయి? 

సర్వాంతర్యామిగా మన లోపల, మన బయటా ఉంటూ, మన ఉనికికి కారణభూతుడై ఉన్న భగవంతుడితో గడపడానికి మనకు సమయం ఉండదు. అయినా ఆయన మనపై ఏనాడూ కోపగించడు. పైగా మననుండి ఏ గుర్తింపును కోరకుండా తానే మనకు నిరంతరమూ సేవ చేస్తుంటాడు! మనలో జఠరాగ్ని  రూపంలో ఉండి మనం తింటున్న ఆహారాన్ని జీర్ణం చెయ్యడం, పంచేంద్రియాలద్వారా సృష్టిలో మనచుట్టూ జరుగుతున్న వాటిని గుర్తించే సామర్ధ్యాలను ప్రసాదించడం, కర్మేంద్రియాలద్వారా పనిచేయగలిగిన శక్తిని ఇవ్వడం, మన ప్రయత్నంతో పని లేకుండా నిరవధికంగా మనలో కొట్టుకొంటున్న గుండె, జరుగుతున్న రక్త ప్రసారం, శ్వాసక్రియ - ఇవన్నీ భగవంతుడు మౌనంగా మనకు చేస్తున్న సేవలే కదా! ఇలా మననుండి ఏమీ, కనీసం కృతజ్ఞత కూడా, ఆశించక, మనకు ఇంత మేలుచేస్తున్న భగవంతుడికంటే పరమ-బంధువు మనకు ఇంక ఎవరు ఉంటారు? 

పరమ బంధువైన భగవంతుడు మనకు ఎన్ని విధాలుగా సహాయం చేస్తున్నాడో, అట్టి భగవంతుణ్ణి ప్రేమతో స్మరించుకోకపోవడం ఎంతటి అపరాధమో తెల్పుతూ, అన్నమాచార్యులవారి పుత్రుడైన శ్రీ పెద-తిరుమలాచార్యులవారు వ్రాసిన కీర్తన ఇది: 


ఎంత పరమబంధుఁడవో యేమని వినుతింతు మిమ్ము
అంత నిన్ను మఱచి నే నపరాధి నైతిని ॥పల్లవి॥

దురితములే నేఁజేసి దుఁఖముఁబొందేనాఁడు
తొరలి నన్ను రోసి తొలఁగ వైతి
నరకము చొచ్చేనాఁడు నాకు నంతర్యామివై
పరుఁడు వీఁడేల యనక సాయమైతివిగా ॥ఎంత॥

జనని గర్భమునందు చెరబడి వుండేనాఁడు
వెనుబలమువై నన్ను విడువ వైతి
పెనఁగి పంచేంద్రియాలు పిరువీఁకులయ్యెనాఁడు
అనుభవింపఁగఁ జేసి అందుకు లోనైతివి॥ఎంత॥

యెట్టు నేఁగోరిన అది యిచ్చి పరతంత్రుఁడవై
మెట్టుకొని నా యిచ్చలో మెలఁగితివి
యిట్టే యీ జన్మమున నన్నేలి శ్రీవేంకటేశ
పట్టి నీ దాసులలోఁ దప్పక మన్నించితివి॥ఎంత॥

కొన్ని పదములకు అర్ధములు:
రోసి = తిరస్కరించి
చెరబడి = బంధింపబడి
పిరువీఁకులయ్యెనాఁడు = అవస్థలు పడుతున్నప్పుడు

భావము:

ఎంతటి పరమ బంధువువో, నిన్ను ఏమని కీర్తించగలను? అట్టి నిన్ను మరచిపోయి నేను అపరాధిని ఐతిని!

నేను పాప కర్మలు చేసి దుఃఖమును అనుభవిస్తున్నప్పుడుకూడా, నాపై విసుగు చెందక, నన్ను విడిచిపెట్టక నాతోనే ఉంటున్నావు. చేసిన దుష్కర్మల ఫలితముగా నరకమునకు పోవలసి వఛ్చినప్పుడుకూడా - వీని సంగతి మనకెందుకు - అని అనుకోకుండా, అంతర్యామిగా నాతోనే ఉండి సాయము చేస్తున్నావు. 

తల్లి గర్భములో శిశువుగా ఒంటరిగా ఉన్నప్పుడుకూడా, నా వెనుక బలముగా నువ్వే ఉంటూ, నన్ను సంరక్షించుకున్నావు. ఇంద్రియ చాపల్యముల పెనుగులాటలతో నేను అవస్థలు పడుతున్నప్పుడు, నాకు ఇంద్రియార్థములను అనుభవింపజేస్తూ, అప్పుడుకూడా అంతర్యామిగా నీవు నాతోనే ఉంటున్నావు. 

నేను కోరినవి అన్నీ  నాకు అందజేస్తూ నీవు నాకు బానిసగా ఉంటున్నావు! నా ఇష్టానుసారంగా నువ్వు నాతో  మెలుగుతున్నావు. జన్మ జన్ములుగా ఇలా పాపములు చేస్తున్న నన్ను మన్నించి, ఓ శ్రీ వేంకటేశా, ఈ జన్మలో నువ్వే నన్ను ఏలుకొని  (నడిపించి)., నన్ను నీ దాసునిగా చేసుకోవయ్యా. 

Saturday, May 19, 2018

అయ్యో పోయఁ బ్రాయముఁ గాలము



అన్నమాచార్యునకు బాల్యమున - తల్లిదండ్రులు, అన్నలు, వదినలు పనులు చెప్పుటయు, భగవత్భక్తి పరాయణుడైన అతడు వానిని చేయజాలక చికాకు పడుటయు జరుగుచుండెను. కుటుంబము వారి వలన తాను చికాకు పొందుటను సూచించు సంకీర్తనములు కొన్ని అన్నమాచార్య సంకీర్తనములలో కలవు. 

అందొకటి ఇక్కడ చూడగలరు:


అయ్యో పోయఁ బ్రాయముఁ గాలము
ముయ్యంచు మనసున నే మోహమతినైతి ॥పల్లవి॥


చుట్టంబులా తనకు సుతులుఁ గాంతలుఁ జెలులు
వట్టి యాసలఁ బెట్టువారే కాక
నెట్టుకొని వీరు గడు నిజమనుచు హరి నాత్మఁ
బెట్టనేరక వృధా పిరివీకులైతి ॥అయ్యో॥


తగుబంధులా తనకుఁ దల్లులునుఁ దండ్రులును
వగలఁ బెట్టుచుఁ దిరుగువారే కాక
మిగుల వీరలపొందు మేలనుచు హరినాత్మఁ
దగిలించ లేక చింతాపరుఁడనైతి ॥అయ్యో॥



అంత హితులా తనకు నన్నలునుఁ దమ్ములును
వంతువాసికిఁ బెనఁగువారే కాక
అంతరాత్ముఁడు శ్రీవేంకటాద్రీశుఁ గొలువ కిటు
సంత కూటముల యలజడికి లోనైతి॥అయ్యో॥



కొన్ని పదముల వివరణలు:

(1) ముయ్యంచు మనసు = మూడు అంచులు గల మనస్సు. త్రిగుణాత్మకమైన మనస్సు అనే అర్ధములో చెప్పి ఉండవచ్చు.
(2) పిరివీకు = పీకులాట, రచ్చ, జంఝాటము, బాధ 
(3) వగలఁ బెట్టుచుఁ = మాయ చేయుచు 
(4) వాసి =  లాభము, ఆధిక్యము, ప్రసిద్ధి  


భావము:

అయ్యో! వయస్సు, కాలము వ్యర్థముగా గడిచిపోయాయి.  నా మనస్సు చేసిన మాయ వలన మొహములో పడిపోయాను. 

భార్యా, పిల్లలు, స్నేహితులు మనకు ఆశలను కల్పించువారేగానీ, వారు నిజమైన చుట్టములా?   వారే నిజమనుకుని, శ్రీహరిని ఆత్మయందు ధ్యానించక వ్యర్ధమైన పీకులాటలలో కాలము వయస్సు  గడిపితిని, అయ్యో!

తల్లిదండ్రులు మాయలో పడవేయువారే గానీ, వారు నిజమైన ఆత్మ బంధువులా? వారిని సంతోషపెట్టడమే పరమావధిగా జీవించుచు, ఆత్మయందు శ్రీహరిని ప్రతిష్టించుకొనక, చింతాక్రాంతుడను ఐతిని, అయ్యో!

అన్నదమ్ములు వంతులకు వచ్చి వారి స్వలాభంకోసం పెనుగులాడేవారేగానీ, వారు మనకు నిజమైన హితులా? అంతరాత్మయందు ఉన్న శ్రీ వేంకటేశ్వరుని కొలవక, సంతల  గుంపులో ఉండు గందరగోళమువలే   అలజడికి లోనైతిని, అయ్యో!

ఇతరులకు నిను నెరుగతరమా?

ఇతరులకు నిను నెరుగతరమా? - అన్నమయ్య సంకీర్తన 



ఇతరులకు నిను నెరుగతరమా
సతత సత్యవ్రతులు సంపూర్ణమోహవిర-
హితు లెఱుగుఁదురు నిను నిందిరారమణా ॥పల్లవి॥


నారీకటాక్షపటు నారాచభయరహిత-
శూరులెఱుఁగుదురు నినుఁ చూచేటి చూపు
ఘోరసంసార సంకులపరిచ్ఛేదులగు-
ధీరులెఱుఁగుదురు నీదివ్యవిగ్రహము ॥ఇతరు॥

రాగభోగవిదూర రంజితాత్ములు మహా-
భాగు లెరుఁగుదురు నినుఁ బ్రణుతించువిధము
ఆగమోక్త ప్రకారాభిగమ్యులు మహా-
యోగులెఱుఁగుదురు నీవుండేటివునికి ॥ఇతరు॥

పరమభాగవత పదపద్మసేవానిజా-
భరణులెఱుఁగుదురు నీ పలికేటిపలుకు
పరగు నిత్యానంద పరిపూర్ణ మానస-

స్థిరు లెఱుఁగుదురు నినుఁ దిరువేంకటేశ ॥ఇతరు॥


చాలా గంభీరమైన భావంగల కీర్తన ఇది! 

నిరంతరము సత్య వస్తువును (పరబ్రహ్మమును) ధ్యానించుటయే వ్రతముగా కలిగినవారు, మోహము  ఇత్యాది అరిషడ్వర్గములనుండి సంపూర్ణముగా విడివడినవారు మాత్రమే నీ గురించి తెలుసుకొనగలరు. మిగిలిన వారికి నీ గూర్చి తెలుసుకోవడం సాధ్యమయ్యే పనేనా?

ఆడవారి ఓరచూపులు అనే పదునైన బాణములపట్ల భయ రహితులైన శూరులు (కామమును జయించినవారు) మాత్రమే నిన్ను చూసే  చూపు కలిగి యుంటారు. ఘోరమైన సంసారము (నానాత్వము) అనెడి సంకెళ్లను త్రెంచుకున్న ధీరులైనవారు మాత్రమే నీ దివ్యమైన విగ్రహమును ఎఱుగుదురు. 
     
ఇష్టాఇష్టములనుండి, భోగాసక్తి నుండి విముక్తులైన మహనీయులు మాత్రమే నిన్ను ప్రార్ధించు విధమును ఎఱిగియున్నారు. వేదా శాస్త్రములయందు తెలుపబడిన రీతిన సాధన చేయుచున్న యోగులు మాత్రమే నీయొక్క ఉనికిని ఎఱుగుదురు.

పరమ భాగవతుల యొక్క పాదపద్మములను భక్తితో సేవించి ధన్యులైన వారే నీవు పలికే పలుకులను ఎఱుగగలరు (గ్రహించగలరు). ఓ వెంకటేశ్వరా! శాశ్వత ఆనందమును అనుభవించు స్థిత ప్రజ్ఞులైనవారు (మాత్రమే!) నిన్ను ఎఱుగగలరు. 


Wednesday, April 18, 2018

తుంబుర తీర్థం


తిరుమల గిరులపై నెలకొని ఉన్న పవిత్ర తీర్థములలో తుంబుర తీర్థం చాలా ప్రశస్తమైనది. కొండపైగల పాపవినాశ తీర్థం నుండి సుమారు 8 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. పాపవినాశ తీర్థం నుండి సంవత్సరములో 3 రోజులుమాత్రమే (ఫాల్గుణ పౌర్ణిమ నాడు) ఈ తీర్థానికి వెళ్ళడానికి అనుమతిస్తారు. ఈ సంత్సరం ఈ తీర్థానికి వెళ్లే అవకాశం కలిగింది. తుంబుర తీర్థం గురించి శ్రీ P V R K ప్రసాద్ గారు తమ తిరుమల లీలామృతము అనే పుస్తకములో వ్రాసిన వ్యాసం మీరు ఇచట చదువగలరు. అలానే వెంకటేశ్వర భక్తి చానల్ వారు తుంబుర తీర్థంపై రూపొందిచిన చక్కటి డాక్యుమెంటరీని ఇక్కడ చూడవచ్చును.


------

ప్రాచీన బర్హి ఒక మహారాజు... అతనికి యఙ్ఞాలు చేసే అభిలాష చాలా ఎక్కువ... ప్రపంచమంతా దర్భలను పెంచి ఎప్పుడూ యఙ్ఞాలు చేయడమే కర్తవ్యంగా పెట్టుకొన్న కర్మయోగి. 

ఒకనాడు గాన గంధర్వుడు తుంబురుడు ఆ రాజ్యానికి వచ్చి, ఆ రాజు చేసిన, చేస్తున్న యఙ్ఞ కర్మలు చూచి, చాలా సంతోషించి,ప్రాచిన బర్హిని ఎంతో శ్లాఘించాడు. "నీవంటి రాజు భూమండలంలోనే లేడు ఎన్ని యఙ్ఞాలు చేశావు! నీ వంటి గొప్ప వాడింకొకడు లేడు. నీలాగా దానాలు చేసిన వారుకాని, ధర్మాలు చేసినవారు కానీ బ్రాహ్మణులకు సంతర్పణలు చేసినవాడు గాని ఇంకొకరు లేడు. నీవు వీర, శూర, దానశిఖామణివి" అని పొగిడాడు. ప్రాచీనబర్హిని అంతగా పొగడడానికి ఇంకొక కారణం కూడా ఉంది. ప్రాచీనబర్హి దగ్గర ఒక విశేష వీణ ఉంది. అది నవరత్నఖచితం. మణిమాణిక్యాలు పొదగబడిన చాలా అరుదైన, ఖరీదైన అద్భుత వీణ. దాన్ని పొందడంకోసం, మానవమాత్రుడైన ప్రాచీనబర్హిని గానగంధర్వ ముఖ్యుడైన తుంబురుడు ఉత్ర్పేక్షలతో, పొగడ్తలతో ముంచెత్తాడు. అలా పొగిడి ఆ వీణను ఆ రాజునుండి పొందాడు.

ఆ వీణ తీసుకొని నారద ముని వద్దకు వచ్చాడు. ఆ వీణను చూచి జరిగిన విషయమంతా తెలుసుకొన్న నారదులవారికి చాలా కోపం వచ్చింది." అయ్యో, భగవంతుని పొగడాల్సిన, సేవించాల్సిన మనం, మానవమాత్రుడైన ప్రాచీనబర్హిని పొగడడమేమిటి? అందున కామ్యాపేక్షతో అటువంటి నీచపు పని చేసిన నీవు దండార్హుడవు... ఆకాశమార్గంలో సంచరించే శక్తి గల గంధర్వుడవు. మన విద్య ప్రతిభ , శక్తియుక్తులు భగవంతుని ఆరాధనకే గాని ఉదరపోషణకుగాని, స్వలాభాపేక్షకుగాని కాదు. ఇలా అన్యథా లాభంకోసం నరస్తుతి చేసిన నీకు ఆకాశమార్గంలో వెళ్లే అర్హతపోయి భూలోకంలో జన్మించు" అని శపిస్తాడు. ఆ నారదశాపం ఒకరకంగా తుంబురుని ఉద్ధారానికే... 

తుంబురుడు స్వతహాగా సాత్వికుడు, భక్తుడు, యోగ్యుడు... ప్రారబ్ధం వల్లనో, క్షణిక అఙ్ఞానం వల్లనో, తాత్కాలిక అసురావేశంతోనో, ఈ తప్పు చేసినా భగవదనుగ్రహం ఉంది కనుక, భులోకంలో శ్రీ వేంకటాచలంలో ఘోణతీర్థం దగ్గర పడ్డాడు. అక్కడ తీర్థంలో రోజూ స్నానం చేసి తపస్సు చేసుకొంటూ ఉంటాడు. 

అలా తీర్థస్నాన, తపాలు చేస్తున్న తుంబురునికి ఫాల్గుణ మాసంలో భగవంతుని ప్రత్యక్షం జరుగుతుంది. భగవంతుడొక్కడే కాకుండా బ్రహ్మది దేవతలతో సహా వస్తాడు. వారందరినీ అ ఘోణాతీర్థంలో స్నానం చేయమంటాడు భగవంతుడు. వారితోపాటు తుంబురుని కూడా స్నానం చేయమంటాడు. అంతటితో తుంబురునికి శాపవిముక్తి కలిగి తన గంధర్వరూపం, ఆకాశయాన శక్తి ఇతర గంధర్వశక్తులు ముఖ్యంగా మాధుర్యంగా గానం చేసే శక్తి తిరిగి వస్తాయి. 

భగవంతుని తుంబురుడు తాను ఉద్ధారమైన ఆ తీర్థానికి తన పేరు ఉండాలని కోరతాడు. భగదిచ్ఛ వల్ల అప్పటినుండి ఆ తీర్థానికి ఘోణాతీర్థం బదులు తుంబురుతీర్థంగా ప్రసిద్ధి వచ్చింది. అలా తుంబురుడు కోరడానికి రెండు కారణలు. దేవతలు, మహాత్ములు, ఙ్ఞానులు ఆ తీర్థంలో స్నానం చేసినప్పుడు తన పేరు చెప్పుకుంటే, వారిపుణ్యంలో భాగం, తనకంటే తక్కువవారు స్నానంచేసి తన పేరు తల్చుకుంటే వారికి పుణ్యం కల్గించే భాగ్యం అదొక పుణ్యం. ఇది చాలా మహాత్మ్యం గల తీర్థం. సకలదేవతలు భగవంతుని సమక్షంలో స్నానం చేసిన తీర్థం. ఆ తీర్థానికి వెళ్లి స్నానం చేయకుండా వస్తే ఈ తీర్థాన్ని తిరస్కరించినందుకు పంచమహా పాతకాలు చుట్టుకుంటాయని వరాహాపురాణం చెబుతుంది. స్నానం చేస్తే ఈ పాతకాలు పొతాయి. 

ఈ తుంబురుడు భగవంతుని అనుగ్రహం ప్రత్యేకంగా ఇంకొకసారి పొందుతాడు. ఒకసారి కుబేరుని ఆఙ్ఞానుసారం చాలా తొందరలో రంభ కుభేరుని దగ్గరకు వెళ్తుంటే దారిలో తుంబురుడు ఆపుతాడు. సంగతి చెప్పినా వినక బంధిస్తాడు. కుబేరుడు కోపంతో కదలలేని రాక్షసుడవు కమ్మని శాపాన్నిస్తాడు. అలా విరాధుడనే రాక్షసునిగా జన్మ తీసుకుంటాడు. రాములవారి అనుగ్రహంతో శాపవిమోచనమౌతుంది. భరతకాలంలో 'సంజయుడి' గా అవతారం చేసి ధృతరాష్ర్టుని సారథిగా వుండి భగవదనుగ్రహంతో దివ్యదృష్టి కలిగి కురుక్షేత్ర యుద్ధమంతా దూరదర్శనం చేసి ధృతరాష్ర్టునికి వినిపించినవాడే ఈ తుంబురుడు.

ఈ తుంబుర క్షేత్రమహిమ గురించి వరాహపురాణంలో ఇంకొక సంఘటన వివరించబడింది. ఈ తుంబురుతీర్థ మహిమ గురించి గార్గిఋషి దేవతలఋషిని, ప్రశ్నిస్తాడు. 

తుంబురుడు శాపవిమోచనమైనాక ఒక మాఘమాసం తెల్లవారకుండానే లేచి, మాఘస్నానం చేసి పూజదేవతార్చనకు సిద్ధమవుతాడు. తన భార్య ఇంకా నిద్ర పోతుండడంచూచి, ఆమెను లేపి, మాఘమాస పవిత్రస్నానం చేసి తను పూజకు సిద్ధం చేయమంటాడు. మాఘమాసంలో చలి, ముఖ్యంగా తెల్లవారుజామున ఇంకా ఎక్కువ, భార్య బద్ధకిస్తుంది. సకాలంలో స్నానం చేసి పూజకు సదుపాయం చెయ్యదు.

తుంబురుడు కోపించి కప్పవై నీరులేని చోట పడి వుండి దుఃఖం అనిభవించమని శాపం ఇస్తాడు. ఆమె చేసిన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో భర్తను శాపవిమోచనం చెప్పమని ప్రార్థిస్తుంది. సరే అని విమోచనం ఎలా అవుతుందో కూడా చెబుతాడు. 

అలా ఆమె ఒక అశ్వత్థవృక్షం వేళ్లలో నరకయాతన పడుతూ వేయి సంవత్సరాలు జలాధారం లేకుండా వ్యథ అనుభవిస్తుంది. ఒకనాడు అగస్త్యముని యాత్రకు వెళ్తూ ఆ అశ్వత్థవృక్షం నీడలో వుండి తన శిష్యులకు వేంకటాచలంలోని తుంబురు తీర్థమహిమ వర్ణన చేస్తాడు. అక్కడే వేళ్లల్లో ఉన్న ఆ కప్పకు తుంబురతీర్థ మహిమ శ్రవణంతో శాపవిమోచనమై అగస్త్యునికి నమస్కరించి ధన్యవాదాలు తెలుపుతుంది. 

అగస్త్యులు ఆమెకు పాతివ్రత్యధర్మాలు, పతిమాట జవదాటకూడదన్న ధర్మవిషయాలు చెప్తాడు. పతి అధర్మపరుడై, నిషిద్ధకర్మలు చేయమని ఆదేశిస్తే పత్ని అటువంటి ఆఙ్ఞ పతి ఆఙ్ఞ అయినా తిరస్కరించవచ్చని కూడా చెప్తాడు - పతి ధార్మికుడై భగవంతుని అర్చనకు సహాయం అడిగినప్పుడు, నిర్లక్ష్యం చేయడం పతివ్రతాదర్మం కాదని చెప్పి - ఆమెను ఆశీర్వదించి పంపుతాడు.

ఇలా తుంబురతీర్థ మహిమ వింటేనే పాప నాశనమైతే, తుంబురతీర్థంలో స్నానం చేస్తే ఎంత మహిమో చెప్పాలా ?

కానీ ఈ స్నానాలు, ఙ్ఞానంతో చేయాలి. తీర్థమహిమ తెలుసుకొని చేయాలి. ఏ నీళ్లన్నా స్నానం చేయాల్సిన అవసరం ఉంది కనుక స్నానం చేస్తే అంత ఫలం రాదు. మహిమ తెలుసుకొని, స్నానం చేసేప్పుడు ఆ తీర్థమహిమ తలచుకొని, ఎవరెవరు ఈ తీర్థంలో తరించారో వారిని స్మరించుకొని, తాను చేసిన పాపాలకు పశ్తాత్తాపం చూపిస్తూ చేసిన స్నానఫలం కృష్ణార్పణమస్తు అని శ్రీనివాసునికి సమర్పిస్తే - ప్రక్షాళన కాని పాప ముండదు. రాని పుణ్యముండదు.

అరుంధతీ దేవి కూడా 12 సంవత్సరాలు ఈ తుంబురతీర్థంలో ప్రతి రోజూ స్నానం చేసి తపస్సు చేసిందని పురాణం చెబుతుంది. భగవంతుడు ప్రత్యక్షమై, ఏమి వరం కావాలంటే - ఆమె "ఈ తుంబురతీర్ధమహిమాఙ్ఞానం నాకు పూర్తిగా కలిగితే చాలు" అంటుంది... అంతటి మహిమ కల్గినది ఈ తీర్థం. అరుంధతికి తెలుసు ఈ తీర్థంలో భగవంతుని విశేష సన్నిధానం వుందని, దానితోపాటు భగవంతుని ఆఙ్ఞతో సకల దేవతాసన్నిధానం కూడా ఇక్కడ వుంది కనుక ఇది మోక్షమిచ్చే శక్తిగల తీర్థమని అర్థం చేసుకోవాలి. అవకాశం తెచ్చుకొని, జన్మలో ఒక్కసారైనా, ఈ తీర్థానికి వెళ్లి శ్రద్ధతో స్నానం చేస్తూ, ఈ తుంబురుతీర్థమహిమా పారాయణం చేస్తే, పాతివ్రత్యఫలం వస్తుంది. ముఖ్యంగా పతివాక్య ఉల్లంఘనా దోషం పోతుంది. ఈ రోజుల్లో పతివాక్యం ఏదో సమయంలో ఉల్లంఘన చేయని పత్నులు అరుదుగదా? ఈ తీర్థస్నానం చాలా అవసరం!!

అన్నమయ్య కీర్తన "మనుజుడై పుట్టి, మనుజుని సేవించి.... దుఃఖమందనేల" అన్నది విన్నాం కదా! ఈ మానవజన్మ భగవంతుని గుణగానం చేయడానికి గాని, ఇతరులను పొగడటానికి కాదని తుంబురుని కథ సూచిస్తుంది. 

తరిగొండ వెంగమాంబ భర్త పోయినా, 'విధవత్వం' తీసుకోకుండా సుమంగళిగా ఉండి, సమాజ ఆక్షేపణకు గురై, తరిగొండ వదిలి తిరుమల వస్తుంది. అక్కడ కూడా అర్చకాదుల తిరస్కారానికి, క్రోధానికి గురైనప్పుడు ఈ తుంబురతీర్థానికి వచ్చి, ఇక్కడ ప్రతిరోజూ స్నానం చేస్తూ ఒక దశాబ్ద కాలం తపస్సు చేసింది.. అలా పొందిన పుణ్యంతోనే ఙ్ఞానం, భక్తి, వైరాగ్యం సంపాదించి, స్వామివారిపై రచనలు చేసి, పీఠాధిపతులను సైతం కట్టడి చేయగల శక్తి సామర్థ్యాలు సంపాదించింది. ఇప్పటికీ తరిగొండ వెంగమాంబ నివసించిన ప్రదేశంగా తుంబురతీర్థంలో ప్రసిద్ధిచెందిన స్థలం చూడవచ్చు. ఆమె సమాధిని కూడా తిరుమలకొండపై ఈనాటికీ చూడవచ్చు. ఈసారి తిరుమల వెళ్లినప్పుడు చూడటానికి ప్రయత్నం చేయండి.

ఈ తీర్థం స్వామివారి దేవాలయానికి ఉత్తరదిక్కులో దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. మాఘ (మార్చి - ఏప్రిల్ ) పౌర్ణమిరోజు ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో స్నానం మహా విశేషం. ఆ రోజు ముక్కోటి దేవతలు, బ్రహ్మదేవునితో సహా ఈ తీత్థంలో స్నానం చేస్తారు. అందుకే దీనిని ఫల్గుణీతీర్థం అని కూడా అంటారు. దేవస్థానం నుండి పూజా నైవేద్యం జరుగుతుంది.

************************.

Sunday, April 15, 2018

తిరుమల వెంకటేశ్వరుని మూర్తి రూపంలో ఉన్న దేవుడు ఎవరు?


తిరుమలలోని శ్రీవారి అర్చామూర్తి... 

(1) విష్ణువువలే కటి-వరద హస్థుడై ఉంటుంది. పురాణములలో అనేకచోట్ల, ఈ కలియుగములో శ్రీమహవిష్ణువు అర్చావతారముగా వేంకటాచలముపై వెలసినట్లు చెప్పబడినది.

(2) అర్చామూర్తి పరమశివునివలే జటజూటము, నాగాభరణములను ధరించి ఉంటుంది. అంతేగాక సంవత్సరములో ఒక నెల ఈ విగ్రహానికి బిల్వపత్రములతో పూజ చేస్తారు.

(3) శివ పుత్రుడైన కుమార-స్వామి (బాలాజీ?) ఈ పర్వతము పై వెలసినట్లు పురాణములలో కొన్నిచోట్ల చెప్పబడినది ("కలౌ కుమార రూపేణ షణ్ముఖౌ భగవాన్ హరిః దృశ్య తైక ముఖేనైవ వేంకటాచలనాయకః” - మార్కండేయ పురాణం --- ఆరు ముఖాలు కలిగిన "కుమారస్వామి" కలియుగంలో ఏకముఖుడై భగవంతుడైన – "వెంకటేశ్వర స్వామిగా" అనుగ్రహిస్తూ ఉన్నాడు.).

(4) అర్చామూర్తియొక్క సౌకుమార్యమైన సుందర రూపము, వారికి పసుపుతో అభిషేకం చేయడం, కళ్ళకు కాటుక దిద్దడం, స్వామివారి వెలుపలి ప్రాకారములోగల సింహ శిల్పములనుబట్టి ఆమూర్తి అమ్మవారిది అని శాక్తేయులు విశ్వసిస్తారు. 


ఇంతకీ అసలు తిరుమల వెంకటేశ్వరుని మూర్తి రూపంలో ఉన్న దేవుడు ఎవరు?

"అంతా తానే అయిన ఒకే పరతత్వమే ఒక విగ్రహరూపంలో, జీవులను ఉద్ధరించుటకై, అర్చావతారముగా ఈ కొండపై వెలసి ఉన్నది. ఎవరు ఏ రూపములో తనను ఉపాసిస్తే, వారికి ఆ రూపంతోనే అనుగ్రహాన్ని ప్రసాదించే రూపం ఇక్కడ ఉన్నది! ఎవరు ఏ భావంతో ఉపాసిస్తే వారిని ఆవిధంగానే అనుగ్రహిస్తుంది." అని ఆత్మజ్ఞానులైన వారు చెప్పినమాట. 


 ఈ విషయమునుగూర్చి కంచి పరమాచార్యుని మాటలను, తాళ్ళపాక అన్నమాచార్యుని మాటలను ఇక్కడ స్మరించుకుందాము. అటువంటి ఆత్మజ్ఞానులైన మహాత్ములు, ఆచార్యుల వాక్యములే మనకు ప్రమాణము.




అన్నమయ్య కీర్తన:



ఎంతమాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు
అంతరాంతరములు ఎంచిచూడ పిండంతే నిప్పటి అన్నట్లు|| || ఎంత ||

కొలుతురు మిము వైష్ణవులు కూరిమితో విష్ణుడని
పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మంబనుచు
తలతురు మిము శైవులు తగిన భక్తులును శివుడనుచు
అలరి పొగడుదురు కాపాలికులు ఆది భైరవుడవనుచు|| || ఎంత ||

సరినెన్నుదురు శాక్తేయులు శక్తిరూపు నీవనుచు
దరిశనముల మిము నానావిధులను తలపుల కొలదుల భజింతురు
సిరుల మిమ్మునే అల్పబుద్ధి తలచిన వారికి అల్పంబవుదువు
గరిమల మిమునే ఘనమని తలచిన ఘనబుద్ధులకు ఘనుడవు|| || ఎంత ||

నీవలన కొరతేలేదు మరి నీరుకొలది తామెరవు
ఆవల భాగీరథి దరి బావుల ఆ జలమే ఊరినయట్లు
శ్రీవేంకటపతి నీవైతే మము చేకొనివున్న దైవమని
యీవల నే నీ శరణనియెదను ఇదియే పరతత్వము నాకు|| || ఎంత ||

భావము:

పిండి కొలది రొట్టె అన్నట్లుగా, నీవు ఎంతటివాడివని (లేదా ఎవరివని) విశ్వసిస్తే అంతటి (అటువంటి) ఫలితమునే వారికి ప్రసాదిస్తావు. 

వైష్ణవులు నిన్ను విష్ణువంటారు. వేదాంతులు నువ్వే పరబ్రహ్మం అంటారు. శైవులు నిన్నే శివుడని అంటారు. కాపాలికులు తమని రక్షించే భైరవుడవు నీవని పొగడుతారు.

శాక్తేయులు నిన్ను శక్తి రూపంగా తలుస్తున్నారు. వివిధ వర్గాలవారు, వివిధ పేర్లతో దర్శించి పూజించేది నిన్నే. నీగూర్చి తక్కువగా తలచిన వారికి నీవు అల్పునిగానే వ్యక్తమవుతూ ఉంటావు! నీవెంతో ఘనుడవు అని తలచిన బుద్ధిమంతులకు నీ గొప్పతనమును ఆవిధముగానే ఎంతో విశేషముగా తెలియజేసి అనుగ్రహిస్తావు.


నీయందు అల్పత్వము (కొరత) లేదు. నీటియొక్క మట్టాన్ని బట్టి అందులోనున్న తామరపువ్వు యొక్క ఎదుగుదల ఉన్నట్లు, జీవులయొక్క భావనను అనుసరించి వారు పొందే ఫలితము ఆధారపడి ఉంటుంది. గంగానది ఒడ్డునగల బావులలో కూడా ఆ గంగానదిలోని నీరే ఎలా ఊరుతుందో, అలానే నిన్ను ఏరూపంలో ఉపాసించినా ఆ రూపంలోనే వ్యక్తమై అనుగ్రహించేదికూడా నువ్వే. శ్రీ వేంకటచలపతిగా మమ్ము అనుగ్రహించుచున్న నీవు నాకు అన్నిరూపములుగా వ్యక్తమవుతున్న పరతత్వమే. అట్టి నిన్ను నేను శరణువేడుచున్నాను.



కొన్ని పదముల వివరణ:

(1) "అంతరాంతరములు ఎంచిచూడ" = లోతుగా, నిశితముగా చూడగా

(2) "పిండంతే నిప్పటి అన్నట్లు"
నిప్పటి అంటే చక్కిలము లేక అరిసె. "పిండి కొలది రొట్టె" అన్న సామెత వలె, "పిండికొలది నిప్పటి" అనే సామెత అప్పట్లో వాడుకలో ఉండేదట.


(3) "నీరుకొలది తామెరవు":
ఇది అప్పట్లో వాడుకలో ఉన్న సామెత. నీటిమట్టాన్ని బట్టి నీటిలోతేలే పువ్వు పెరుగుదల ఉంటుంది. అలాగే, మనుషుల ఉత్సాహాన్నీ, ప్రేరణనీబట్టి వారి ఎదుగుదల ఉంటుంది అని ఈ సామెత అర్ధము.